గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాధ్ కోవింద్ గారికి, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడి గారికి, గౌరవనీయులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ శరద్ అరవింద్ బోబ్డే గారికి, గౌరవనీయులు భారత ఉపరాష్ట్రపతి శ్రీ ఎమ్. వెంకయ్యనాయుడు గారికి, (1/n)
మరియు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి నమస్కరించి వ్రాయునది.
అయ్యా నేను ఆంధ్రప్రదేశ్ లో ఒక మధ్య తరగతి వ్యక్తిని. కనీసం నా పేరు కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే నా పేరు చెబితే నా కులం ఏదో ఊహించి ఇప్పుడు నేను మీతో విన్నవించుకునే విషయాలన్నీ(2/n)
ఆ కులం వారి అభిప్రాయాలు మాత్రమే ఇతర కులాల వారు అందుకు పూర్తిగా వ్యతిరేకం అని ప్రచారం చేసే పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉంది.నా వయసు 47 సంవత్సరాలు. భార్య ఇద్దరు పిల్లలతో కొంతకాలం క్రితం వరకూ నాకున్నదానితో సుఖం గానే బ్రతికాను. (3/n)
కానీ ప్రస్తుతం దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలను చూస్తే నా భవిష్యత్తు ఏమిటో అని భయమేస్తుంది. ఒక రైతుగా మా తండ్రిగారు కష్టపడే నన్ను చదివించారు. నేను కూడా నా చదువైన తరువాత హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడ్ని. రాష్ట్ర విభజనానంతరం నా ప్రాంతం గొప్పగా (4/n)
అభివృద్ధి చెందుతుందని , నా పిల్లలు కూడా మా ప్రాంతంలో రాబోయే మంచి విద్యాసంస్థల్లో చదువుకుని ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవచ్చని ఆశించి నా బంధుమిత్రులతో, నా ప్రాంతం లోనే అంతా కలసి బ్రతకవచ్చని హైదరాబాదులో చేస్తున్న ఉద్యోగం వదిలేసి స్వరాష్ట్రానికి వచ్చేశాను. (5/n)
కానీ ఈ రోజు ఇక్కడ జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే నేను చేసింది చాలా తప్పు అనిపిస్తుంది. నాకు మొదటి నుండి రాజకీయాలు అంటే అంత ఆసక్తి లేదు. నా చిన్నతనం నుండి అనేకమంది నాయకులను చూసాను. అధికార ప్రతిపక్ష పార్టీల విమర్శలు సవాళ్లు ప్రతివిమర్శలు ఇవన్నీ రాజకీయాలలో సాధారణం. (6/n)
కొన్ని అంశాలపై విమర్శలు చేసుకున్నా అధికార విపక్ష నాయకులు ఒకరినొకరు గౌరవించుకునేవారు. ఆ పరిస్థితి రాష్ట్రం లోనూ కేంద్రం లోనూ ఉండేది. నాయకులు వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్ళేవారు కాదు. ఆ నాటి నాయకులకు ప్రజలలో గౌరవం ఉండేది. ఒక ఎమ్మెల్యే మా గ్రామానికి వచ్చారంటే (7/n)
ఎంతో ఆసక్తితో వారిని చూసేవాళ్ళం. కానీ ఈనాడు రాజకీయ నాయకులంటే ప్రజలకు ఉన్న గౌరవం ఎంత హీనస్థితిలో ఉందంటే, సాధారణ పౌరుడికి అసలు ఈ నాయకులు అవసరమా అని వారిని అసహ్యించుకునే స్థాయి కి విలువలు పతనమైపోయాయి. రాజకీయ నాయకులు వాడే భాష, అధమస్థాయికి (8/n)
చేరిన వ్యక్తిగత విమర్శలు, చట్ట సభల్లో వారి ప్రవర్తన, వారి హావభావాలు, మోసపూరిత వాగ్దానాలు, అధికారమే పరమావధిగా ఆత్మగౌరవాన్ని, మనస్సాక్షిని చంపుకుని చెప్పే అబద్ధాలు ఇలా ఎన్నో వికృత పోకడలు వారంటే అసహ్యం కలిగే విధంగా ఉన్నాయి ఇటువంటి వారి నుండి ఏ విధమైన అభివృద్ధిని ఆశించగలం? (9/n)
అభివృద్ధి విషయం అటుంచితే వీరి వలన జరుగుతున్న విధ్వంసం భయానకం. వారి స్వార్థం కోసం సమాజాన్ని ఎంతగా ధ్వంసం చేయటానికైనా వీళ్ళు సిద్ధం. ప్రజలను కులమతాల పరంగా ప్రాంతాల వారీగా విడదీసి ఒకరిపై ఒకరికి ద్వేషాన్ని పెంచి సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. విలువల్లేవు. ఉన్నదంతా (10/n)
అధికార వ్యామోహం, ధనవ్యామోహం మాత్రమే. ఇదేమిటని ఎవరైనా అమాయకంగా ప్రశ్నిస్తే ఇక వారి గతి అధోగతే. ఒక్కసారిగా వాళ్ళపై ఎన్నో కేసులు, పోలీసుల వేధింపులు అరెస్టులు. కేవలం జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఆ పాపానికి వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరిగి (11/n)
పాపపరిహారం చేసుకోవాల్సిందే. ఇవన్నీ చూసిన మిగిలిన వారు మనకెందుకు ఈ ఖర్మ అని నోరు మూసుకు కూర్చుంటారు. నాయకుల లక్ష్యం కూడా అదే. మా చిన్నతనంలో పోలీసులంటే చాలా గౌరవం ఉండేది. ఈ రోజు నాయకుల ఆదేశాలు అమలు చేసే క్రమంలో వారు సాగిస్తున్న దమనకాండ,(12/n)
అమానవీయ అరాచక పోకడలు చూస్తుంటే వీళ్ళు రక్షిస్తుంది ప్రజలనా లేక అధికార పార్టీ నాయకులనా అనిపిస్తుంది. పోలీస్ వ్యవస్థ ఇంతలా దుర్వినియోగం కావటం మొదటి సారి చూస్తున్నాను. వారు ఏ విధులు నిర్వర్తించటానికి ఉద్యోగంలో చేరారో ప్రస్తుతం ఏ విధులు నిర్వర్తిస్తున్నారో ఒక్కసారి గమనిస్తే (13/n)
సిగ్గుపడాల్సిన పరిస్థితి. రక్షక భటులు కాస్తా ప్రజల భక్షక భటులు, నాయకుల చేతిలో ఆటబొమ్మలు అయ్యారు. అయ్యా రాజకీయ నాయకులు, వారి వల్ల విధిలేక పోలీసులు ఇలా అయ్యారనుకుంటే అంతకన్నా భీతి కొల్పే విషయం సివిల్ సర్వెంట్ల అవినితి ప్రయాణం. ఒకప్పుడు ఐఏఎస్ , ఐపిఎస్ లంటే దేవుళ్ళతో సమానం.(14/n)
తమ పిల్లలు ఆ చదువులు చదవాలని ప్రతి తలిదండ్రులు కలలు కనేవారు. సమాజం లో వారికున్న గౌరవం వారిమీద అభిమానం అత్యంత ఉచ్ఛస్థితిలో ఉండేవి. కానీ ఈనాడు వారి గౌరవం మసకబారింది. అవినీతికి, రాజకీయ నాయకుల ప్రాపకానికి వారు కూడా అతీతులు కారని చాలామంది సివిల్ సర్వెంట్లు నిరూపిస్తున్నారు.(15/n)
ఒకప్పుడు ఎవరైనా ఒక ఐపియస్ లేదా ఐఏఎస్ అధికారి తప్పు చేసారని తెలిస్తే అది ఒక వింత. దురదృష్టవశాత్తూ ఈనాడు అది సాధారణ విషయమై పోయింది. నేను నిజాయితీ గా చెబుతున్నా. ఒకప్పుడు నా పిల్లల్లో ఒకరినైనా సివిల్స్ కు పంపాలని కలగనేవాడ్ని. ఈ రోజు మాత్రం ఆ సాహసం చేయలేను.(16/n)
కష్టపడి అంత చదువు చదివి వారు చేయబోయేది ప్రజలకు సేవకాదు. స్వార్థ రాజకీయ నాయకుల సేవ అనేది కళ్ళముందు కనబడుతుంటే నా పిల్లలను అటువైపు ఎలా ప్రోత్సహించగలను? ప్రస్తుత పరిస్థితుల్లో ఒక దారుణాన్ని మించి మరొకటి ఉన్నాయి. దారుణాతి దారుణమైన విషయం న్యాయవ్యవస్థపై రాజకీయ నాయకుల దాడి.(17/n)
శాసన కార్యనిర్వాహక వ్యవస్థల ద్వారా ఏవైనా తప్పులు జరిగితే సరిదిద్ది ప్రజలకు న్యాయం చేయాల్సిన అత్యున్నత వ్వవస్థ న్యాయవ్యవస్థ. అటువంటి న్యాయవ్యవస్థ పైనే దాడులు జరుగుతుంటే ఇక ప్రజలకు దిక్కేది? ఇంకా దారుణమేంటంటే అత్యున్నత న్యాయ వ్యవస్థ లో అత్యున్నత పదవిలో పనిచేసిన వారు (18/n)
పదవీ విరమణ తర్వాత అదే న్యాయవ్యవస్థను కించపరుస్తూ వ్యాఖ్యానించడమే కాక రాజకీయ నాయకుల ప్రాపకం కోసం వ్యవస్థను నాశనం చేయాలని ప్రయత్నించటం. ఇంతకన్నా ఘోరం ఏదైనా ఉందా??
అసలు దేశంలో వ్వవస్థల మీద ప్రజలకు నమ్మకం ఉందా అనేది అనుమానమే. (19/n)
అందుకు ముఖ్య కారణం తప్పుకు సరైన సమయంలో సరైన శిక్ష పడకపోవటమే. ఒక వర్గం వారు అన్ని వ్యవస్థలను ధిక్కరిస్తారు. వారి స్వార్థం కోసం ఎంత దారుణమైనా చేస్తారు. వారి అవినీతికి అంతులేదు. సహజవనరులను కొల్లగొట్టి సమాజానికి భవిష్యత్తు లేకుండా చేస్తారు. తమను ప్రశ్నించిన వారిని (20/n)
అణచి వేస్తారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ లపై దాడి చేస్తారు. చివరికి రాజ్యాంగాన్ని కూడా లెక్క చేయరు. వారి అధికార ధన వ్యామోహానికి అంతులేదు. అందుకు ఎంత విధ్వంసానికైనా ఒడిగడతారు. ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ ఆపలేరు. కారణం వారు చేసేది తప్పు అని, దానికి శిక్ష తప్పదని (21/n)
వారికి భయం లేదు కనుక. వారు చేసే తప్పులకు సకాలంలో సరైన శిక్ష విధిస్తే వేరొకరు ఆ తప్పు చేయటానికి భయపడతారు.కాకపోతే వారిని శిక్షంచేదెవరు. ప్రజలలో మార్పు వచ్చి ప్రజలే వారిని శిక్షించే రోజు వస్తుంది. కానీ దానికి సమయం పడుతుంది. ఈ లోపు ఈ దారుణాలు ఆగాలన్నా, ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం(22/n)
కలగాలన్నా దేశ అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు బాధ్యత తీసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రజా ఉద్యమం ద్వారా మార్పు రావలసి వచ్చినపుడు ఆ ప్రజాగ్రహం ముందు ఏవీ నిలువవు. తిరిగి జాతి నిర్మాణం మొదలు పెట్టవలసి ఉంటుంది. ఆ స్థితి రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా మీరు కార్యాచరణ మొదలు పెట్టవలసిందే. (23/n)
భారతదేశాన్ని ప్రపంచానికి తలమానికంగా తీర్చి దిద్దవలసిన బాధ్యత మీదే.
నమస్సులతో
ఒక దిక్కుతోచని ఆంధ్రప్రదేశ్ పౌరుడు. (24/n) 🙏🙏🙏
You can follow @mana_maata.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: